కాకాని చక్రపాణి

కాకాని చక్రపాణి (కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు)

కాకాని చక్రపాణి (కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు)

కాకాని చక్రపాణి తెలుగు కథా రచయిత. మానవ జీవన సంఘర్షణలను, అక్రోశాలను, అత్మీయతానుబంధాలను హృద్యమైన శైలిలో రుపుదిద్దగల శిల్పి అయన. వీరు దాదాపు పన్నెండు నవలలు, ఎన్నో కథలు లెక్కకు మించిన అనువాదాలు, వ్యాసాలు ప్రకటించారు.

కాకాని చక్రపాణి గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో 1942, ఏప్రిల్ 26వ తేదీన శ్రీరాములు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరు మంగళగిరి సి.కె.ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం ముగించి, ఉన్నత విద్యను గుంటూరులో కొనసాగించారు. 1966లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇరువురు కుమారులు. 1993లో భార్య మరణించగా 1999లో పునర్వివాహం చేసుకున్నారు. 1970లో ఇంటి నుండి తిరుపతికి 600 కి.మీ.ల దూరం కాలినడకన ప్రయాణం చేయడం వీరి జీవితంలో ముఖ్య ఘట్టం. వీరు హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో 1974 నుండి 2000 వరకు 37 సంవత్సరాలు ఆంగ్లభాషా బోధకుకులుగా పనిచేసి పదవీవిరమణ చేశారు. ఆంగ్ల బోధన వీరి వృత్తి తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి వీరి వ్యావృత్తి మనిషి మృదుభాషి. తను విభేదించే విషయంలో సైతం ఎదుటివారిని నొప్పించని తత్త్వం వీరిది. స్నేహితులతో కబర్లంటే ఇష్టపడతారు. తెలుగు నవలా సాహిత్యంపై సోమర్సెట్ మామ్ ప్రభావం అన్న అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి పట్టం పొందారు.

డా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు, నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. తమ పరిశోధనలో భాగంగా మామ్ రాసిన ఆఫ్ హ్యూమన్ బాండేజ్ నవలను అనువదించారు. ఇటీవలే ద్రావిడ విశ్వవిద్యాలయం కోసం రాజశేఖర చరిత్ర, మైదానం, చివరకు మిగిలేది, అల్పజీవి నవలలను ఫోర్ క్లాసిక్స్ ఆఫ్ తెలుగు ఫిక్షన్ పేరిట ఆంగ్లంలోకి అనువదించారు.కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతావాదంతో కూడుకొని ఉంటాయి ఆయన సృజనాత్మకత రచనలు. ఆంధ్రభూమి దినపత్రికలో చాలా సంవత్సారాలు “కథలు – కాకరకాయలు” అనే శీర్షిక నిర్వహించారు.

కాకాని నాలుగు కథా సంపుటాలను ప్రచురించారు. అవి “థ్రిల్లింత”, “నివురు”, “పతితపావని”, “మనిషి”. అందులో ఒకదానికి డాక్టర్‌ కేతు విశ్వనాథరెడ్డి ముందుమాట రాస్తూ ‘చిత్తవృత్తుల్ని ఆడించే శక్తుల్ని ఈ రచయిత తన కథల్లో ఒక అన్వేషకుడిగా పట్టుకో డానికి ప్రయత్నించాడు. మనిషిని మనిషిగా, ఒక సామాజిక సాంస్కృతిక మూర్త పదార్థంగా పరిశీలించాడు. మనుష్యులు కోల్పోతున్న ఆపేక్షలను గుర్తిం చాడు. పోగొట్టుకుంటున్న విలువల్ని చర్చించాడు’ అంటారు. అసలు మనిషికి స్వేచ్ఛ వున్నదా, వుంటే ఆ మేరకు ఏ వ్యక్తి అయి నా జీవించగలడా, ఆ గీతలు గీచే సమాజ ప్రభావం ఎలాం టిది అన్న అతి గహనమైన విషయాన్ని చక్కటి శిల్పంతో దిద్దిన కథ ‘నిస్వార్థం’. మెరుపు తీగలాటి వివేకవతి అయిన భార్య వుండి కూడా వీధుల వెంబడి కుక్కల్లాగా తిరిగే భర్తను, సంయమనం నిండిన ఛీత్కారంతో చిత్రించింది ‘చుక్కల్లో చంద్రుడు’ కథ. ‘మరమరాలు బఠాణీలు అందులో సామ్యవాదం’లోని నారా యణరావు, ‘రెండు ముఖాల చంద్రుడు’లోని రామచంద్రం, ‘మహా పర్వతంా మరుగుజ్జు’లోని రామం నేటి కాలంలోని పురుషకు సం స్కారానికి ప్రతినిధులు. స్త్రీ పురుష సంబంధాలను వేర్వేరు కోణాలనుండి ‘భార్యంటే’, ‘తాకట్టు’, ‘ఛీ! ఏం మగాడు’ కథలు పరిశీలించగా ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’ మనసుకు శరీరానికి మధ్యగల శక్తివంతమైన సం బంధాన్ని చిత్రీకరిస్తుంది. ఆయన రచనలో వ్యక్తీకరించిన కొన్ని యదార్థ వాదాలు ఇలా వుంటాయి.

నవలలు

వేగుచుక్క
ఏడడుగులు
గోరంత దీపం
నూరు శిశిరాలు
ది ఘోస్ట్

కథా సంపుటాలు

థ్రిల్లింత
పతిత పావని
మనిషి
నివురు

అనువాదాలు , కథాసంపుటాలు

భారతీయ కథా భారతి
విశ్వకథా కదంబం
కోల్పోయిన ప్రపంచం-మరికొన్ని కథలు

వీరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ తమ 75వ యేట 2017, జనవరి 2వ తేదీన హైదరాబాద్ లోని తమ స్వగృహంలో మరణించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *