లక్ష్మిరాదట చెడు లక్షణమ్ములు నున్న
గౌరి నిలువబోదు కఠినునింట!
వాణినిలుచునెట్లు పట్టి చదవకున్న
శక్తిమంతుడైన జరుగునన్ని!!
పదులువంద వేయి, పదివేలు పదులైన
లక్షణమ్ముగాను లక్షయె గద!
లక్షలవియు వం రయమున కోటియౌ
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
వేయిమంది స్త్రీలు వెంటుండ నేమియు
సొంత భార్య వలెను సుఖము రాదు!
మల్లెకు సమమౌనె? మందార పూలెల్ల
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
ప్రగతిబాట మరచి పనిలేక దిరుగుచు
బానిసలుగ జేయు ప్రజలనెల్ల!
ఓటు నోటు గోరి ఓటరు తానోడు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
ప్రగతిబాటననుచు పదవులు చేపట్టి
ప్రగతినొందు నేత ప్రజలముంచి!
పదుగురాడుమాట వసుధపై నిదియేను
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
అవతరించె చూడు అర్థనారీశుడు
చీరలమ్ము వాడు సిగ్గువీడి!
బాధలెల్ల మోయు బ్రతుకుదెరువు గోరి
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
-గడ్డం కృష్ణారెడ్డి.
రేపాల సూర్యాపేట!
Chala bagundhi..