ఆ నవ్వు
మల్లెలు జలజల రాలుతున్నట్లు , స్వేచ్ఛ పావురం ఎగురుతున్నట్లు చల్లని సమీరం , తాకుతున్నట్లు వెన్నెల పుష్పం వికసించినట్లుంది ఆ మోము .
చైతన్యానికి నాంది పలుకుతూ ఆ నవ్వు స్వాగతం పలుకుతుంది చిరునవ్వుతో మొదలెడితే లేదు అపజయం అన్నది ఆ నవ్వు సంకేతం
ఉత్తేజాన్ని నింపాలని ఊసుల కడలి నింపాలని ఉవ్వెత్తున ఎగసిపడే ఆ నవ్వుల సిరిగంగ
ఆశయం నెరవేదితే చేరే ఉత్సాహానికి నాందిలా దివ్యకాంతి తేజోమయమై ఆ నగవులు వెలిగె దివ్య కాంతులు.
ఎదుటివారి మానసాన్ని దోచుకునేందుకు సిరి నవ్వుల తేనెల మధువులు ఆ ముఖారవిందం గమకాలు.
తన వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపుకునే వారధి ! కలుపుగోలుతనం నిండిన మమతల వల్లరి పూసిన ఆ నవ్వుల జావళి.
కూర్చును మోమున సంబరం అంబరాన్ని తాకిన ఆనందపు సవ్వడి పులకింతల పూబోణి హృదయ గంధపు పరిమళం ఆ హాసం.
– ఆలపాటి సత్యవతి