appude samajam bagupadutundi

జీవవైవిద్యము

జీవవైవిద్యము

“ఏమండీ రేపటి ప్రోగ్రాం గుర్తుంది కదా!” పడుకునే ముందు ఉమాపతికి గుర్తు చేసింది భార్య జయంతి.

“అన్నీ మనం అనుకున్నట్లే జరగాలి. నాకు బాగానే గుర్తుంది. నువ్వు మాత్రం మర్చిపోకు. తెల్లవారుజామునే లేవాలి. పిల్లలిద్దరినీ లేపి తయారు చేయాలి. అలారం పెట్టాను. నువ్వు నిద్రపో.” భార్యకు అన్ని వివరంగా చెప్పి నిద్రకుపక్రమించాడు ఉమాపతి.

ఉమాపతి ఆర్ అండ్ బి లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య జయంతి గృహిణి. ఆమె డిగ్రీ వరకు చదివింది. వారి అన్యోన్య దాంపత్యానికి వారసులుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. పది సంవత్సరాల బాబు పేరు అజిత్. వాడు ఐదవ తరగతి చదువుతున్నాడు. ఎనిమిది సంవత్సరాల పాప పేరు అపర్ణ. ఆమె మూడవ తరగతి చదువుతుంది. చురుకైన పిల్లలు. వారం రోజుల క్రితం అజిత పుట్టినరోజు వేడుకను చేశారు. ఆ వేడుకలో ఉమాపతి కొడుకుకి చేసిన వాగ్దానం ప్రకారం ఒక రోజంతా జూ లో గడపాలి.

జయంతి తెల్లవారుజామున అలారం కొట్టగానే లేచి అలారాన్ని ఆపేసింది. భర్త ఉమాపతిని లేపలేదు. ఆరోజు వాళ్లకు కావలసినవన్నీ తానే తయారుచేసి హాట్ ప్యాక్ లలో సర్దింది. ఆమె స్నానం చేసి తయారయ్యి భర్తను బెడ్ కాఫీతో లేపింది. తర్వాత లేవటానికి బద్దకిస్తున్న పిల్లలకు నెమ్మదిగా చెవిలో ఆనాటి జూ ప్రోగ్రాం విషయం చెప్పగానే వాళ్లు ఉత్సాహంగా నిద్ర నుండి బయటపడ్డారు.

అందరూ తయారయ్యారు. వాళ్ళింట్లో పెంచుకుంటున్న కుక్క జూలీ కూడా వాళ్లతో పాటు సిద్ధంగా ఉంది. టిఫిన్ తిని బయలుదేరారు.

“మత్స్యావతారం పెట్టె లో ఆహారం వేసావా?” కూతురు అపర్ణను అడిగింది జయంతి.

“నేను టిఫిన్ తినడానికి ముందే వేశానమ్మా.” ముద్దుగా చెప్పింది అపర్ణ.

“మరి నీ కూరిమి తొట్టె లో ఆహారం వేసావా?” కొడుకు అజిత్ ను అడిగాడు ఉమాపతి.

“అపర్ణ కన్నా ముందే నేను నా కూరిమికి ఆహారం తొట్టెలో వేశాను.” చెల్లి వంక చూస్తూ చెప్పాడు అజిత్.

పిల్లలిద్దరినీ తల్లిదండ్రులు మెచ్చుకోలుగా చూశారు. వాళ్ళింట్లో కుక్క జూలీతోపాటు చేపలను మత్స్యావతారం బొమ్మ వేసి ఉన్న ఒక అద్దాల పెట్టెలోనూ, అలాగే ఒక తొట్టెలో కూరిమి అని పేరు పెట్టిన ఓ తాబేలునూ పెంచుతున్నారు. మత్స్యావతారం బాధ్యతను అపర్ణకూ, కూరిమి బాధ్యతను అజిత్ కూ అప్పగించారు.

భార్యాభర్తలిద్దరూ నీతి కథలతో పాటు పిల్లలకు తరచూ జీవవైవిధ్యం గురించి చెబుతుంటారు. అరుదైన జంతువులను మనం కోల్పోకూడదని వాళ్లకు చాలాసార్లు సందర్భానుసారంగా చెప్పారు.

బయలుదేరే ముందు ఉమాపతి కొడుకుకు చిన్న పరీక్ష పెట్టాడు. అజిత్ భుజాలపై చేతులు వేసి “జీవవైవిధ్యం గురించి క్లుప్తంగా చెప్పు.” అన్నాడు.

ఏమి చెబుతాడా అని జయంతి తో పాటు అపర్ణ కూడా ఆసక్తిగా అజిత్ వైపు చూసింది.

“మనకున్న జంతువులలో ఏ ఒక్కటీ ఎక్కువా కాదు. అలాగే తక్కువా కాదు. అన్నీ సమానమే. అన్ని జంతువులూ ఒకదానిపై మరొకటి ఆధారపడి బతుకుతున్నాయి.” తండ్రి గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని తడుముకోకుండా చెప్పాడు అజిత్.

జయంతీ అపర్ణలు మెచ్చుకోలుగా చప్పట్లు కొట్టారు. ఉమాపతి కొడుకును హత్తుకొని నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు.

తర్వాత ఉమాపతి కారులో అన్ని సర్ది భార్యను ముందు సీట్లో కూర్చోమని పిల్లలను వెనక సీట్లో కూర్చోపెట్టాడు. పిల్లలను సీటు బెల్టు పెట్టుకోమని చెప్పక ముందే వాళ్లు సీటు బెల్టు పెట్టుకోవడం గమనించి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఉమాపతి.

“అమ్మా సీటు బెల్టు ఎందుకు పెట్టుకోవాలో నన్నడగవా?” బుంగమూతి పెట్టి అడిగింది అపర్ణ.

జయంతి అడగగానే తల్లి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని సీటు బెల్టు పెట్టుకోవలసిన అవసరాన్ని ముద్దు ముద్దుగా వివరించింది అపర్ణ. ముందు సీటులో కూర్చున్న జయంతి వెనుకకు తిరిగి అపర్ణ చంపలను చేతితో తాకి ఆ చేతిని వెనక్కి తీసుకొని ముద్దు పెట్టుకుంది. తండ్రి కారు స్టార్ట్ చేస్తూ “శభాష్ తల్లీ.” అని కూతుర్ని మెచ్చుకున్నాడు. అపర్ణ గర్వంగా ‘నీకే కాదు నాకూ అన్నీ తెలుసు’ అన్నట్లు అజిత్ వైపు చూసింది.

సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జవహర్లాల్ నెహ్రూ జూలాజికల్ పార్క్ కి చేరారు.

ఉమాపతి తమతో వచ్చిన కుక్క జూలీని అక్కడ వాచ్మెన్ కు అప్పగించి టోకెన్ తీసుకున్నాడు.

తరువాత జూ పార్కులో ఉమాపతి పిల్లలకు
సింహాలను, పులులను, ఏనుగులను, జిరాఫీలను, కోతులతో పాటు ఇతర జంతువులను చూపించి వాటి వాటి ప్రత్యేకతలను వివరించాడు.

సింహాన్ని అడవికి రాజని ఎందుకంటారో చెప్పాడు.

జయంతి గతంలో పులి చారలను నక్క అనుసరించే కథను పిల్లలకు చెప్పింది. పులుల ఒంటిపై చారలను చూసి ఆ కథను గుర్తు చేసుకున్నారు అజిత్ అపర్ణలు.

ఏనుగు జ్ఞాపకశక్తి తెలివితేటలపై చెప్పిన కథలనూ, కార్టూన్లనూ కూడా గుర్తు చేసుకున్నారు పిల్లలు.

జిరాఫీ పొడవైన మెడలనూ, వాటి ఒంటిపై ఉన్న చుక్కలనూ పిల్లలు ఆసక్తిగా చూసి ఆనందించారు.

ఉమాపతి కోతులను చూపించి మానవులతో వాటికున్న సారూప్యతను పిల్లలకు వివరించాడు. కోతుల చురుకైన ఆటలకు వాళ్ళు గంతులు వేశారు.

మధ్యాహ్న సమయానికి అలసిపోయిన పిల్లలను ప్రశాంతమైన వాతావరణమున్న ఓ చెట్టు నీడకు తీసుకువెళ్లారు. హాట్ ప్యాక్ లో జయంతి తెచ్చిన రుచికరమైన పదార్థాలను అందరూ తిన్నారు.

కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక అందరూ టాయ్ ట్రైన్ లో ఎక్కి నెమ్మదిగా ప్రయాణిస్తున్న రైలు నుండి జంతువులను చూశారు. కొన్నిచోట్ల ఆ జంతువులను ఫోటోలు తీశారు.

సాయంత్రం వరకూ ఆనందంగా గడిపారు. తరువాత ఓ చెట్టు కింద కూర్చుని జయంతి తయారుచేసి తెచ్చిన స్నాక్స్ అందరూ తిన్నారు.

పిల్లలు స్నాక్స్ తింటున్నప్పుడు – “ప్రపంచంలో ఉన్న అరుదైన జంతువులతో హైదరాబాదు నగరంలో ఫోర్త్ సిటీ ముచ్చర్లలో కూడా ఓ కొత్త జులాజికల్ పార్క్ తయారైపోయిందట. మీరు ఎప్పటిలాగే బుద్ధిగా ఉంటే అపర్ణ పుట్టినరోజు అయ్యాక నాన్నగారు ముచ్చర్ల జులాజికల్ పార్కుకు మనల్ని తీసుకువెళతారు.” అని వాగ్దానం చేసింది జయంతి. పిల్లలు సంతోషంగా తలలు ఊపుతూ తండ్రివంక చూశారు.

ఉమాపతి “ఓ కే.” అనీ పిల్లల వైపు తిరిగి “అంతేకాదు నేను మీకు మరో ఆఫర్ ఇస్తున్నాను. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మీ ఇద్దరికీ క్లాస్ లో మంచిర్యాంక్ వస్తే మీ ఇద్దరి పేరనా మీకు ఇష్టమైన ఒక్కొక్క జంతువును దత్తత తీసుకుందాం.ఆ జంతువులను జులాజికల్ పార్కులో మీరిచ్చినట్లుగా నమోదు చేసి పెంచుతారు” అన్నాడు.

పిల్లలు సంతోషంగా చప్పట్లు కొట్టి తండ్రి దగ్గరకు వెళ్లి అతన్ని హత్తుకొన్నారు.

అన్నీ సర్దుకున్న తర్వాత వాచ్మెన్ కు అప్పగించిన తమ కుక్క జూలీని ఉమాపతి తీసుకుని వచ్చాడు.

తిరుగు ప్రయాణంలో ఒక మంచి హోటల్లో డిన్నర్ తీసుకుని ఆనందాలను మూట కట్టుకుని ఇంటికి చేరింది ఆ కుటుంబం. అప్పటికే పిల్లలిద్దరూ వెనక సీట్లో నిద్రలోకి జారుకున్నారు. కార్ పార్కు చేశాక అపర్ణను జయంతీ అజిత్ ను ఉమాపతీ భుజాన వేసుకుని తమతో పాటు వచ్చిన కుక్క జులీ ఉత్సాహంగా ముందు నడుస్తుంటే ఇంట్లోకి వెళ్లారు.

భార్యాభర్తలిద్దరూ ఫ్రెష్ అప్ అయ్యి అలసిన దేహాలను మంచంపై వాల్చారు. ఆ తర్వాత జయంతిని దగ్గరకు తీసుకుంటున్న భర్తతో – “మీరు చాలా గ్రేట్. జంతువుల విషయంలో మాత్రమే కాదు. మన ఇంట్లో కూడా ఎప్పుడూ ఎటువంటి తేడా చూపరు. అన్నింటిలో నాకు సమాన ప్రాధాన్యతను ఇస్తున్నారు. పిల్లల మధ్య ఆడా, మగా అనే వివక్షే లేదు మన కుటుంబంలో. గతంలో పిల్లలకు మీరు చెప్పిన జీవవైవిధ్యాన్ని ఈ రోజు క్రియాశీలకంగా చూపించారు.” అన్నది జయంతి.

“ఇప్పటికీ ఎప్పటికీ అన్నింటిలో నా కన్నా నువ్వు ఏమాత్రం తక్కువ కాదు.” అంటూ భార్యను గాఢంగా హత్తుకున్నాడు ఉమాపతి.

కథ సమాప్తం

– విజయకుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *