అక్షరం
అక్షరం ఎందుకో ! తెలియకుండానే ఈమధ్య అక్షరాలని తెగ ప్రేమించేస్తున్నాను.... అప్పుడెప్పుడో భూతంలో చీకటిలో ఉన్నప్పుడు అక్కున చేర్చుకున్న అక్షరాలపై అప్రయత్నం గా ఆకర్షణకు లోనయ్యాను.. బేలగా బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్నప్పుడు భయపడొద్దని భరోసా ఇచ్చి ఇరుల నుండి వేలు పట్టి నను వెలుగులోకి నడిపించిన అక్షరాలను అమాంతంగా ప్రేమించేశాను.. ఆ అక్షరాల చుట్టూ తపస్సు చేస్తున్నాను. ఏనాటికైనా ప్రేమతో ఆ అక్షరాలు నన్ను అక్కరకు చేర్చుకోపోతాయా! అవే అక్షరాలు నా హృదయాన్ని తడిమి ఆర్ద్రత తో తడిపి సాహిత్య భావజాలాలను మొలకెత్తిస్తాయి.. తన్మయత్వపు తీగలు మేని పందిరంతా అల్లుకుని పెదవిపై మొలక నవ్వులు వికసింప చేస్తాయి... అందుకే వాటితో పీకల లోతు ప్రేమలో కూరుకుపోయాను... వలచి వచ్చానని అలసు కాబోలు.. నాతో అంటీ ముట్టనట్టు ఉంటాయి.. దూరం నుండే ఊరిస్తాయి.. గోపికలతో రాసలీలలాడిన కృష్ణుని చూసి అసూయపడిన రాధలా వేరే వాళ్ళ చెంతనున్న అక్షరాలని చూసి నేనూ అంతే అసూయపడతాను..…