జె.భాగ్యలక్ష్మి

జె.భాగ్యలక్ష్మి

జె.భాగ్యలక్ష్మి

జె.భాగ్యలక్ష్మి ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి. ఈమె చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 ఫిబ్రవరి 2 న జన్మించింది. దేశ రాజధాని ఢిల్లీలో స్థిరపడింది. ఈమె ఆంగ్లసాహిత్యం అధ్యయనం చేసి కమ్యూనికేషన్‌లో శిక్షణ పొందింది. అడ్వాన్స్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ రిలేషన్స్, బుక్ పబ్లిషింగ్ విషయాలలో దేశ విదేశాల డిప్లొమాలను సంపాదించింది. జర్నలిస్టుగా పేరుపొందింది. ఈమె ఇండియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీస్ (ఐ.ఐ.ఎస్) ఆఫీసరుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలో మీడియా డైరెక్టరుగా, కేంద్ర సమాచార,ప్రచార మంత్రిత్వశాఖ వారి పత్రిక యోజనకు ఛీఫ్ ఎడిటర్‌గా, పబ్లికేషన్స్ డివిజన్ ఎడిటర్‌గా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్‌కమ్యూనికేషన్స్ ప్రచురణల శాఖకు అధిపతిగా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా వివిధ హోదాలలో పనిచేసింది. ఇండియన్ అండ్ ఫారిన్ రివ్యూ, కమ్యూనికేటర్ వంటి పత్రికలకు సంపాదకురాలిగా పనిచేసింది. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, మీడియా సలహాదారుగా, మాస్ కమ్యూనికేషన్ సంస్థలలో గెస్ట్ ఫాకల్టీగా పనిచేస్తోంది.

ఈమె ప్రభుత్వ పత్రినిధిగా, జర్నలిస్టుగా వివిధ అధ్యయనాలకు బంగ్లాదేశ్, జపాన్, శ్రీలంక, చైనా, టిబెట్, భూటాన్, ఈజిప్టు, సిరియా మొదలైన దేశాలలో పర్యటించింది.
ఇంగ్లీషు తెలుగు భాషలలో రచయిత్రిగా ఈమె 45కు పైగా పుస్తకాలను రచించింది. తొలిరోజులలో జానకి అనే కలంపేరుతో రచనావ్యాసంగం సాగించింది. ఈమె ప్రచురణలలో కథాసంకలనాలు, కవితాసంకలనాలు, సాహిత్య విమర్శ, అనువాదాలు ఉన్నాయి. వివిధ విషయాల గ్రంథాలకు సంపాదకత్వం వహించింది. ఈమె రచనలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజనత, పుస్తకం, కథాంజలి,ఆంధ్రప్రభ, పత్రిక,అనామిక,ఆంధ్రభూమి, ఉదయం,ప్రజామత,ఢిల్లీ తెలుగువాణి,విజయ మొదలైన తెలుగు పత్రికలలోనే కాక త్రివేణి, విదుర వంటి ఆంగ్ల పత్రికలలో కూడా అచ్చయ్యాయి.

భాషా విషయమై ఈమె అభిప్రాయం ఇలా ఉంది. “ఏ భాషయినా భావప్రకటనకు అది ఒక మాధ్యమమనే నేను భావిస్తాను. మన భాష, పరభాష అనేది ఏదీ ఉండదు. భాషలవల్ల జ్ఞానం విస్తరిస్తుందేగాని కుచించుకు పోదు. ప్రతి భాషలోనూ సహజమైన అందాలుంటాయి. మనం భాషను ప్రేమించగలగితే అందులోని సొగసులు, అందమైన కూర్పులు, మధురసంగీతం మనసును అలరించినట్లు అలరిస్తాయి. ఇంగ్లీషులో వ్రాసినా, తెలుగులో వ్రాసినా, సంస్కృతంలో వ్రాసినా మరే భాషలో వ్రాసినా మౌలికంగా మనం మనమే. మన రచనల్లో మన అవగాహన,దృక్పథాలు, ఆలోచనారీతులే వెల్లడవుతాయి.”

రచనలు
ఐవీ కాంప్టన్ బర్నెట్ అండ్ హర్ ఆర్ట్
కాపిటల్ విట్‌నెస్: సెలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ జి.కె.రెడ్డి ISBN 978-81-7023-316-9
హాపీనెస్ అన్‌బౌండ్ (కవితలు)ISBN 978-81-220-0536-3
ఎ నాక్ అట్ ది డోర్ (కవితలు)ISBN 978-81-220-0685-8
వెబ్ ఫార్చ్యూన్ స్మైల్డ్ (కవితలు) ISBN 978-81-220-0722-8.

కథానిలయంలో లభ్యమవుతున్న జె.భాగ్యలక్ష్మి కథలు
అంతరాంతరాలు
అనుకున్నదొకటీ…
అనూహ్యం
అమ్మ చెప్పిన మాట
అర్థాలే వేరులే

పురస్కారాలు
రఫీ అహమ్మద్ కిద్వాయి బహుమతి
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమరచయిత్రి అవార్డు
జ్యేష్ఠ లిటరరీ అవార్డు
కథా అవార్డు
ఆర్.కె.నారాయణ్ అవార్డు
ఢిల్లీ తెలుగు సంఘం ప్రతిభా పురస్కారం
సిద్ధార్థ కళాపీఠం విశిష్టవ్యక్తి పురస్కారం
గృహలక్ష్మి స్వర్ణకంకణము.

మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *