నీతోనే నా ప్రయాణం
ప్రియమైన నా మనసుకు దగ్గరైనవాడా…!
సాయంత్రపు ఆకాశం నారింజరంగు దుప్పటి కప్పుకున్నట్టుగా, సముద్రతీరంలో ఇద్దరు ప్రేమికులు నిశ్శబ్దంగా ఒకరినొకరు అక్కున చేర్చుకున్న దృశ్యం. ఎంత అందంగా ఉందో! ఆ క్షణం నాకు మనిద్దరినే గుర్తు చేస్తోంది. ఆ నిశ్శబ్దంలో దాగి ఉన్న భావాలు, మాటలకన్నా ఎక్కువ అర్థం చెప్పేస్తున్నాయి. అలాంటి మౌనపు మాధుర్యమే మన ప్రేమ అని అనిపిస్తోంది.
నీతో గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో ఓ స్వర్ణక్షణం. నీ పక్కన కూర్చుని సముద్రపు అలలను చూస్తూ, ఆకాశంలో మసకబారుతున్న సూర్యుడిని గమనిస్తూ మాట్లాడిన రోజులు ఇప్పటికీ నా గుండెల్లో తీయని జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. అప్పుడు మన మధ్య మాటలు తక్కువే ఉండేవి. కానీ , మనసుల మధ్య మాత్రం మాటలే అవసరం లేనంత ప్రేమ ఉండేది.
నీ భుజంపై తలవాల్చి ప్రపంచాన్ని మరచిపోవాలని ఎప్పుడూ అనిపిస్తుంది? నీతో ఉన్నప్పుడు నాకు భయం ఉండదు, ఒంటరితనం తెలియదు. నువ్వు నా జీవితానికి దారి చూపే దీపంలా, నా మనసుకు ఆశ్రయంలా అనిపిస్తావు. నీ చిరునవ్వు చూస్తే చాలు, నా బాధలన్నీ మాయమైపోతాయి.
ప్రేమ అంటే గొప్ప మాటలు కావని, ఖరీదైన బహుమతులు కావని, కేవలం ఒకరి పక్కన ఒకరు నిశ్శబ్దంగా ఉండగలగడమే నిజమైన ప్రేమ అని నువ్వే నాకు నేర్పావు. మనిద్దరం కూడా జీవితాంతం ఒకరికొకరం తోడుగా ఉండాలని నా హృదయం కోరుకుంటోంది.
నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ ఉదయం కొత్త వెలుగుతో మొదలవుతోంది. ప్రతీ సాయంత్రం నీ ఆలోచనలతో మధురంగా ముగుస్తోంది. నీ మాటలు నా గుండెల్లో సంగీతంలా మారి ఎప్పుడూ మారుమోగుతూనే ఉంటాయి? నీతో మాట్లాడిన ప్రతి మాట, కలిసి నడిచిన ప్రతి అడుగు నాకు అమూల్యమైన వరంలా అనిపిస్తాయి.
ఈ ప్రపంచంలో ఎన్నో అందాలు ఉన్నాయి. ఆకాశం, సముద్రం, నక్షత్రాలు, చంద్రుడు. కానీ వాటన్నిటికన్నా అందమైనది మాత్రం నువ్వే. నీ ప్రేమ నా జీవితానికి ఇచ్చిన ధైర్యం మాటల్లో చెప్పలేనిది. ఎన్ని కష్టాలు వచ్చినా, నీ చేయి నా చేతిలో ఉంటే చాలు, ఏ తుఫానునైనా ఎదుర్కోగలననే నమ్మకం నాకు కలుగుతుంది.
ఎప్పటికీ ఇలాగే నీ ప్రేమలో మునిగిపోవాలని ఉంది? కాలం మారినా, పరిస్థితులు మారినా, మన మధ్య ఉన్న అనుబంధం మాత్రం ఆకాశంలా ఎప్పటికీ చెదరిపోకూడదని కోరుకుంటున్నాను?
నా కలలు, నా ఆశలు, నా ఆనందం అన్నీ నువ్వే. ఈ లేఖ ద్వారా చెప్పాలనుకున్నది ఒక్కటే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను. నా ప్రతి శ్వాసలో నువ్వే ఉన్నావు.
నీతోనే నా ప్రయాణం, నీతోనే నా గమ్యం. జీవితాంతం నీ పక్కన ఉండే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటూ…
ఎప్పటికీ నీ ప్రేమలో…
నీ ప్రియురాలు…
మాధవి కాళ్ల