కత్తిమీదసాము
ఆ శనివారం సాయంత్రం.
రవి ఇంటి బాల్కనీలో కాఫీ కప్పుతో కూర్చుని ఉన్నాడు. ఫోన్ స్క్రీన్ మీద అతని కుమార్తె “మీరు రీల్‌లో ట్యాగ్ చేయబడ్డారు!” అనే నోటిఫికేషన్ మెరిసింది. నవ్వాడు. కానీ ఆ నవ్వు ఆలోచనల్లో మునిగిపోయింది.
అతని చిన్నతనం గుర్తొచ్చింది — తండ్రి చేతిలో దెబ్బ తిన్నా ప్రేమతో మెలిగిన రోజులు, తల్లి గోధుమ రంగు దీపపు కాంతిలో తన హోమ్‌వర్క్ చెక్ చేసిన క్షణాలు.
“ఇప్పుడు నా పిల్లను నేనెలా పెంచుతున్నాను?” అని తాను తాను ప్రశ్నించుకున్నాడు.
ఇప్పటి తల్లిదండ్రులు ప్రేమిస్తారు… కానీ ఆ ప్రేమలో భయముండదు.
సౌకర్యాల కోసం, సమయాన్ని కొల్పోతూ, పిల్లలతో ఉండాల్సిన మాటలు ఇప్పుడు చాట్ మెసేజ్‌లుగా మారిపోయాయి.
అదే సాంకేతిక యుగం — తల్లిదండ్రుల చేతిలో మొబైల్, పిల్లల చేతిలో ట్యాబ్.
కానీ, కళ్లల్లో అనుబంధం తగ్గిపోతోంది.
రవి తన కుమార్తె మిహిక దగ్గరికి వెళ్లాడు.
“ఏం చేస్తున్నావ్ బంగారం?” అన్నాడు.
“ఒక వీడియో చేస్తా నాన్న!” అంటూ ఫోన్ వైపు చూపింది.
ఆ క్షణం రవి చేతి ఫోన్ కింద పెట్టి, కుర్చీని దగ్గరికి చేర్చుకున్నాడు.
“నాకూ నేర్పవా?” అన్నాడు.
మిహిక నవ్వింది — ఆ నవ్వులో వంతెన ఏర్పడింది, తరం మధ్య వంతెన!
అతనికి అర్థమైంది — ఆధునికత అంటే పాత విలువలను విడిచి పెట్టడం కాదు, కొత్త మార్గాల్లో వాటిని అందించడం.
తల్లిదండ్రులు మారాలి, కానీ విలువలు కాదు.
మాటల్లో ప్రేమ ఉండాలి, గాడ్జెట్‌లలో కాదు.
సహనం, వినికిడి, సమయం — ఇవే పిల్లల పెంపకంలో కొత్త ఆవశ్యకతలు.
సాయంత్రం కాస్త గాఢమైంది.
మిహిక తన కొత్త వీడియోలో “మా నాన్న బెస్ట్ ఫ్రెండ్!” అని చెప్పింది.
రవి కళ్లల్లో తడిపించింది ఆ మాట.
అతను తాను అనుకున్నాడు —
“పిల్లలతో స్నేహం చేయడం నేర్చుకున్న తల్లిదండ్రులే నిజమైన ఆధునికులు.”
– డా. భరద్వాజ రావినూతల