అలజడుల స్మృతి గీతాలు
అలజడుల స్మృతి గీతాలు గజల్ గాయనిగా జ్యోతిర్మయి మళ్ల మనకు సుపరిచితులు. కవితాత్మక కథనంతో బాల్య స్మృతులుగా కొద్ది కాలం కితం ఆవిష్కరించిన వారు ఇటీవలే కథల పుస్తకాన్ని వెలువరించారు. మొత్తం పదిహేను కథలుంటే వాటిలో ఎనిమిది కథలు రోజుకూలీల జీవితాల కష్టాలను, కడగండ్లను చూపుతాయి. భావం, శైలిలకు సమన్వయం కుదిరితే ఆ కథ మంచి కథవుతుందంటారు విమర్శకులు. ఆ సమన్వయం చాలా కథలలో కనిపిస్తుంది. చెమటచుక్కలను సిరా చేసి రాసినట్టనిపించే కథలివి. ఎక్కువ కథల్లో వృద్ధుల వెతలు కనిపిస్తాయి. అందుకు కారణం నిరాశ్రయులయిన ఎందరో పెద్దవారిని తమ తల్లి ఆశ్రయమిచ్చిందని, వారి వెతలే కథలుగా ప్రాణం పోసుకున్నాయంటారు రచయిత్రి. శ్రీకాకుళం యాస తీయగా పలకరిస్తుందీ కథలలో. మోతాదుకు మించిన నాటకీయత, సినిమాటిక్ మలుపులు లేకుండా సహజంగా కథలివి.కథల్లోని పాత్రలతో మనమూ ట్రావెల్ చేస్తాం. మొక్కజొన్న పొత్తులు కొంటామేమోనని ఎదురు చూసే మనుషులు రైల్వే క్రాసింగ్ ల వద్ద, బస్టాండ్ల్లోను తారసపడుతుంటారు.…