మజిలీ
మజిలీ గతుకులతో ఉన్న మట్టి రోడ్డు మీద దుమ్ము రేపుకుంటూ వెళుతోంది బస్సు. అసలే వేసవి కాలం, అందులో మిట్టమధ్యాహ్నం కావడంతో ఎండ అదిరిపోతోంది. బస్సులో క్రిక్కిరిసి ఉన్న జనం వడగాల్పులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతూ బస్సు ఆగిన ప్రతిసారీ గాలి ఆడక తొందరగా స్టార్ట్ చేయమని డ్రైవర్ పై విసుక్కుంటున్నారు. తొందరగా తమ గమ్యం చేరుకోవడం కోసం అసహనంగా ఎదురుచూస్తున్నారు. బస్సులో కిటికీ పక్కన దూరంగా చూపులు సారించి, బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్లు కూర్చునివున్న తులసి "టికెట్ ఎక్కడి వరకు ఇవ్వాలి? " అంటూ కండక్టర్ రెట్టించి అడిగితేగానీ వర్తమానంలోకి రాలేదు. "ఈ బస్సు ఎక్కడ వరకు వెళ్తుందండి?" అడిగింది. "దేవపురం వరకు" అసహనంగా చూస్తూ చెప్పాడు. "అక్కడికే ఒక టికెట్ ఇవ్వండి". టికెట్ తో పాటు చిల్లర ఇచ్చిన కండక్టర్ "టికెట్.. టికెట్" అంటూ ముందుకు సాగిపోయాడు. బస్సు వేగం పుంజుకుంది. దగ్గరగా వచ్చినట్లే వచ్చి స్థిరంగా…