c s rambabu

భానుమీటర్

భానుమీటర్ బద్దకాన్ని మేసిన మాన్సూన్(monsoon) భానుడు నాట్ సో సూన్ అంటూ అమ్మ చాటు అబ్బాయి లా మేఘాల మాటు దాక్కుంటే ఫక్కుమంటూ మబ్బులన్నీ ముందుకుతోశాయి ఉనికి కోసం భగ్గుమనే ప్రతిపక్షంలా మనవాడూ అంతే మూణ్నెళ్ళు చెమటలు పట్టిస్తాడు ఏదో మూణ్ణాళ్ళ ముచ్చట అనుకుంటే పోలా చిటపటలాడటం మానేస్తాం మాయా ప్రపంచం తమ్ముడూ ఏదీ కుదురుగా ఉండదు ఉండవివ్వదు కూడా చూసీ చూడనట్టుగా పొమ్మనే సూరీడు మాస్టారు చెప్పేది యుగాల ప్రయాణం ఆయనిది తత్కాల్ ప్రయాణం మనది కర్మ సిద్ధాంతం ప్రతినిధిలా సాగిపోతుంటాడు కాస్త సాగిలపడి నేర్చుకుంటే గిలగిలలాడం..విలవిలలాడం.. వీణానాదమంతా తీయగా కాలాన్ని గడిపేయొచ్చు.. అదిగో సాక్షీభూతుడు నవ్వుతున్నాడు.. బారోమీటర్(barometer) లా తనది భానుమీటర్ - సి. యస్. రాంబాబు
Read More

భయం

భయం అనిశ్చితి గంటలా ఆకాశ యానం అప్పుడప్పుడు భయపెడుతుంటుంది శూన్యంలో బరువును కోల్పోయి భారరహితమైనట్టు ఆలోచనల సంద్రం ఎగసిపడటం ఆపేస్తుంది జ్ఞాపకాలను ఆరబెడతాము సంక్షోభ సందేహల స్నానంతో మనసు ఊగిసలాడటం ఆపేస్తుంది ఎడతెగక సాగే ఎగిరే మబ్బులు ఏ అర్థాలు బోధిస్తాయో కానీ జీవితం చిన్నదని గాలిలో తేలే లోహవిహంగం నేర్పుతుంది వైరాగ్య క్షణాల ఉక్కిరిబిక్కిరి మధ్య లాండింగ్ అనౌన్స్మెంట్ లాగి చెంపమీదొకటిచ్చినట్టు నిన్ను లోకంలో పడేస్తుంది రింగయ్యే ఫోన్ సమస్యల వాకిలిని తెరుస్తుంది మెరుపులు మరకలు మళ్లీ తొలకరి వానలా పలకరిస్తుంటే దేహం పులకరిస్తుంది - సి. యస్.రాంబాబు
Read More

కావాలోయ్.. కావాలోయ్..

కావాలోయ్.. కావాలోయ్.. నందనమీ జగతి ఆనందమే ప్రగతి మార్చవోయి నీగతి లేకుంటే అధోగతి నీ మనసుకు అధిపతి నీవేనోయ్ సేనాపతి గిరిగీసిన బతుకుల్లో కావాలొక కులపతి పదవోయ్ పదపదవోయ్ ధైర్యముగా సాగాలోయ్ నీ దారిని నీవేవేసి గమ్యాన్ని చేరాలోయ్ చీదరింపులుంటాయి ఛీత్కారాలుంటాయి చింతలనే చిమ్మేస్తూ చకచకమని కదలవోయ్ చేయిచేయి కలుపుతు అందరిని కలపవోయ్ అలసటను తరిమేసే ఇంధనమే నీవేనోయ్ - సి. యస్. రాంబాబు
Read More

తప్పదు

తప్పదు కురిసే వర్షం పుడమికి పాటై ప్రవహిస్తోంది కానీ మనస్సుకి లాలిపాట పాడే వర్షచ్ఛాయ జాడేలేదు! ఆకలికేకల ప్రకంపనలెందుకో అందరినీ తాకటంలేదో లేక ఏ మధుపాన సేవలోనో మరే మధుపం వేటలో మునిగున్నారో మనుషులు ఇందుమూలంగా తెలియచేసేదేమనగా మనసులు అమ్మేసుకున్నవారూ తాకట్టు పెట్టినవారూ మనసుకు లాలిపాట కోరుకునే హక్కును కోల్పోయారని పుడమికి చినుకు మావిచిగురు వంటిది మనిషికి కలగనటం లాంటిది ఇప్పుడు స్వప్నాలన్నీ వలసబాట వలసబాటనెంచుకున్నాయి మనిషి స్వీయాన్వేషణలో సాగక తప్పదు - సి. యస్. రాంబాబు
Read More

అన్వేషి

అన్వేషి వెతుకుతుంటాను నిరంతరం మానవనాగరికత బాటవేసిన మనిషిని! పరిమళమై వ్యాపించిన మానవత్వాన్ని! పురాతన మనుషులు వారంతా వెక్కిరించాడొక మిత్రుడు! మారుతున్న కాలంతో మారని మనిషికి నువ్వంటు భృకుటి విరిచాడు! కాల ప్రవాహానికి కదిలిపోవటమే తెలుసు మారటం మార్చడం మనిషి చేసే పని కదాని నిట్టూర్చాను! కాలాన్ని వెనక్కి తిప్పలేనట్టే మార్పు చూపును తిప్పలేము రెండూ సాగిపోతుంటాయి! రెప్పలార్పుతు మనిషి మాత్రం అవసరాన్ని ఆసరా చేసుకుని అధికారం చెలాయిస్తాడు! నిరీశ్వరవాదంలా నీది నిరాశావాదం అన్నాడు మళ్ళీ మిత్రుడు! వెనక్కిలాగే మనసును ముందుకు నడిపించలేని మీరంతా ముందుచూపులేనివారేనంటూ దెప్పిపొడిచాడు! నిలువెల్లా కప్పేసిన సాంకేతికత యాంత్రికతను గుమ్మరించేయగా మనిషితనంతో నవనవలాడే మనిషి కనబడలేదని దిగులు మేఘమై కూలబడకని వచ్చే వాతావరణ హెచ్చరిక మనిషిని మార్చే ఋతుపవనాలను వెంటతెస్తుందన్న ఆశ నన్నో నిరంతర అన్వేషిని చేసిందని చెప్పాలని ఉన్నా చెప్పక తప్పుకున్నాను తప్పు తెలుసుకుంటాడన్న ఆశను నింపుకుంటూ! - సి. యస్. రాంబాబు
Read More

నిట్టూర్పు

నిట్టూర్పు రోజూ భయంతో భారంగా అడుగేస్తాడతను నిన్న నిరాశపరిచిందంటాడు నేడు ఆశను పరచలేదంటాడు రేపు వంక చూడనంటాడు! బతుకే అంత సాఫీగా సాగే రహదారిలా ఉండదంటే వినడే అవరోహణల ఆరోహణల రాగవిహంగమై పరుగుతీయటమే అర్థం పరమార్థమని చెప్పాలతనికి! కలతలు కల్లోలాల కొనఊపిరి కొత్తేమీ కాదు అతనికి మారాంచేసే మనసుకు గారాంచేయటం నేర్పాలని అతను నేర్చుకుంటే రేపు వంక ఓర్పుతో చూస్తాడు! సాధ్యాసాధ్యాలను కొలవటం కాదు ధ్యాసను దైవంగా భావించి ఆశను ధ్యానంగా చేసి ప్రేమపాశంతో అతను మనుషులను మనసులను బంధించగలిగితే బతుకు ఆకలి తీర్చే మెతుకవుతందతనికి బోధపడని ఈసత్యాన్ని బోధించే బోధిసత్వుడు అతనికి దొరికితే బావుండన్న నిట్టూర్పు నాలోంచి వెలువడింది! - సి.యస్.రాంబాబు
Read More

సాయి చరితము

సాయి చరితము పల్లవి నీ సేవయే మా భాగ్యము నీ చరితము మాకు అండ నిను కొలిచే భాగ్యము నిరతమూ ఇయ్యవయ్య లోకాలను గెలిచేటి శక్తివయ్య నీవు పాపాలను కడిగేటి భుక్తినివ్వు మాకు చరణం సకల జీవులందు ప్రేమ పంచుతావు ప్రేమతో మాకేమో దారిచూపుతావు అల్పులమూ మేమయ్యా మన్నించు సాయి నీ బాట నడవలేని లేమి బాధనున్నాము చరణం గురువుబాట మరచినచో బాగుపడడు ఎవ్వడు ఈ సత్యము తెలుపుటకు లీలలెన్నో చూపితివి మాన్యుడు సామాన్యుడు అన్న భేదమసలె లేదు అందరొకటె దైవానికి అన్నమాట నీదయ్యా చరణం ఆపదలో మేముంటే తోడు మాకు నీవయ్యా నీ నామస్మరణతో కలతలన్ని తీరిపోవు దేహచింత వదిలి మేము దైవబాట సాగేందుకు ధైర్యమివ్వు సాయి మావెంటవుండవోయి - సి. యస్. రాంబాబు
Read More

వెన్నెల మాయ

వెన్నెల మాయ చంద్రుడి నయనంతో చీకటిలో పయనించామా నీరసమింక పలాయనం వెన్నెల రసఝరిలో ఎన్ని వన్నెల లాహిరిలో ఏకాంతాన్ని వెంటేసుకుని జ్ఞాపకాల మంటేసుకున్న మనసంతా అలజడి కలల నావలో జీవితానికావలి తీరాన్ని వెతకాలని బయల్దేరాను నిండునదిలా వైశాఖ పున్నమి కొత్త ఊపిరితో స్వరాలు కడుతుంటే కొన ఊపిరి ప్రాణానికి సంజీవిని అద్దినట్టు ప్రయాణం పాటయింది..లోనంతా రహస్యవాన నిధిదొరికిన అన్వేషి గాలివాన బతుకును గాటలో పెట్టినట్టు..వెన్నెల మాయే అంత రాత్రిని మధువుని చేసిన నవవధువులా ముసిముసిగా నవ్వుతుంది - సి.యస్.రాంబాబు
Read More

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి ఏడుకొండల వెంకటేశుడా కోరికలన్నీ తీర్చెడివాడా ఆపదమొక్కుల శ్రీనివాసుడా ఆదుకునేందుకు వేగమేరావా చరణం పూజలు ఆచారములే తెలియవు తెలిసినదొకటే నీ నాముముగా నీ తలపులతోనే మదినిండెనుగా తరలివచ్చేటి స్వామివి నీవని భక్తితోడనే నిను కొలిచేము చరణం నీ నామస్మరణయె మము కాపాడును నీ పాదస్పర్శయే పొందిన చాలును గోవిందాయని పలికెదమయ్యా ఏడుకొండలను దర్శించినచో మరుజన్మన్నది లేనేలేదుగ మా చిత్తములోన నిన్నే నిలిపి నిరతము నిన్నే కొలిచెదమయ్యా చరణం మాపై నీ కరుణను చూపి మము రక్షించగ రావయదేవా ఆకలి బాధలు అన్నీ మరచి నీ సేవన మేము తరియించెదము - సి.యస్.రాంబాబు
Read More

పరాయీకరణ

పరాయీకరణ చెమటను చిందించిన చేతులు భవనాన్ని నిర్మిస్తే బతుకుపోరంటావు ఔటర్ రింగ్ రోడ్డుకు రూపకల్పన చేసి మేధోమధనమంటావు అనాదిగా కష్టించే కార్మికులు ఈ దేశంలో సెకండ్, థర్డ్ దాటి కిందకు వెళితే కనిపించే క్లాస్ కు చెందుతారు వారు ఆశ్చర్యం పడాల్సిందేమీలేదు సామూహికంగా అలవాటుచేసుకున్న సానుభూతి చాటున విసుగు వినయాన్ని ప్రదర్శిస్తోంది వారిని తలుచుకో ఒక్కసారి... పునాదులు తీస్తారు ఇటుకపై ఇటుక పేరుస్తారు అంతస్తుపై అంతస్తుకట్టి తథాస్తు దేవతల్లా దీవిస్తారు ఓటుబ్యాంకు కాదు కాబట్టి మరో మజిలీకి మారిపోతుంటారు అద్దె గర్భాన్ని మోసిన తల్లుల్లా కన్నీటితో వీడ్కోలు పలుకుతారా పోనీ జ్ఞాపకాలను కన్నీటిని చేస్తారా గాంభీర్యం అన్నింటిని కప్పేస్తుంది ఆకలితోసహా... ప్రజలూ గొప్పవారే కట్టినవాడు హక్కుదారుడు కాదు హుష్ కాకి అంటే మరో చోటును వెతుక్కుంటూ అలుపెరగని బాటసారిలా సాగిపోతాడు అన్న నిజం తెలిసినవారు కదా ఆకాశంలో పొడిచిన చుక్కలాంటి హర్మ్యమే కావాలి వ్యాపార మర్మం తెలిసిన బలవంతుడిదే కదా విజయమని…
Read More