c s rambabu

ధ్వంస రచన

ధ్వంస రచన పక్షి పాటలో ప్రజల పాట్లను దాద్దామనే ఓ వెర్రి ప్రయత్నమేదో చేస్తున్నాను! బాల భానుడి వెలుగులో భజంత్రీ చప్పుడొకటి చెప్పుడు మాటలా తొలిచేస్తోంది! తొలిమంచు స్పర్శలో తెగిపోతూ జీవితపు అంచు ఒకటి! మబ్బు చాటు చంద్రుడిలా మనసు మసకేసింది తుంపుకుంటూ జీవితాన్ని కష్టాల సరస్సులో ముంచుతోంది! నవ్వుకుంటూ చంద్రవంక కాస్త చూడవా నావంక అంటోంది! కరెన్సీ ఎలాగూ లేదు వెన్నెల కిరణమేదయినా అప్పిస్తాడేమో నెలవంక! వంక పెట్టలేమంటూ ఒకపక్క అంతా వంకరే అంటూ మరోపక్క! తలపోతల జీవితం పక్కదారి పట్టకుండా నిండుకుండలా నిండు సరస్సులా జీవితం సాగేనా! నాతో నేను చేసే యుద్ధం అద్దం పై మరకలా తొలిగేనా! ప్రశ్న శరమై దూసుకొస్తోంది ఆశే ఎండమావై ఎండిన మానులా వెలవెల బోతుంటే తెల్లబోతూ సమాధానం మృదంగ ధ్వానమై ధ్వంస రచన చేస్తోంది! - సి. యస్ రాంబాబు
Read More

లేమి

లేమి మిత్రుడడిగాడు కవిత రాయలేదేమని అన్నింటా 'లేమి' చోటుచేసుకున్న వేళ కవితకూ 'లేమి' చుట్టుకుందని చెప్పాలనుకుని చుట్టూ పరికించి చూశాను రైలెక్కుదామంటే స్థలము లేమి అనుకున్నా ముసిరే చీకట్లలో వేలాడే జ్ఞాపకాల్లా తోసుకుంటూ రాసుకుంటూ మనుషులుంటే గుండెకో హామీ ఉదయాన్నే యమభటుల్లా వేధించే వార్తలతో మనసు తడిలేమితో సతమవుతుంటే తేమ నిండిన నేల తేనీరు పరిమళంలా పలకరిస్తుంది బస్సెక్కుదామంటే జనఘోషలో హారన్ వినిపించలేదు మంచు పేరుకున్నట్టు మనుషుల మనసులపై మౌనం పూశారెవరో! హేమంతం వెలుగుకిరీటాన్ని ధరించలేదెందుకో జంక్ ఫుడ్ తిన్నట్టు సూర్యుడూ జంకుతున్నాడు ఆకలే ఉన్న లోకంలో కలల ప్రస్తావనెందుకుంటున్నాడేమో! కలల తిమ్మిరి కరిగి చాలాకాలమైనా మనసు కళ్ళద్దాల రంగుమాత్రం మారలేదు పంచరంగుల ప్రపంచాన్ని చూద్దామనే ఆశమాత్రం చావలేదు ఆశకిప్పుడు లేమి సమస్య లేదు - సి.యస్.రాంబాబు
Read More

జ్ఞాన సముద్రుడు – కథానిక

జ్ఞాన సముద్రుడు - కథానిక జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నట్టు సీతారాముడికి హైదరాబాద్ మహానగరంలో ఆటో డ్రైవర్ లను విచారించటం ఇష్టం. విచారించటమంటే పోలీసు విచారణ కాదు. క్షేమసమాచారాలు కనుక్కోవడం. అనంతరం తన జ్ఞానాన్ని పంచడం అతని అలవాటు.. పొదుపు చేయటం నుంచి గుట్కా మానివేయటం వరకు చిట్కాలు చిటికెలో చెబుతుంటాడు. ఆ విధంగా ఆతని జ్ఞాన సముద్రం అంతులేనిది. ఇది తెలిసిన వాళ్లెవ్వరూ ఈదే ప్రయత్నం చెయ్యరు. ఇవాళ సీతారాముడు కవాడిగూడాలో ఆటో ఎక్కాడు, సికింద్రాబాద్ లోని సోదరుడింటికి వెళదామని. యథాప్రకారం చిత్రగుప్తుడిలా తన జ్ఞానచిట్టా తీశాడు. ఆలోపలే ఆ డ్రైవర్ అందుకున్నాడు. "సార్..గూగుల్ పే చేయండి సర్ క్యాష్ తీసుకోను.." సీతారాముడు కంగు తిన్నాడు. "ఎందుకని " "ఏం లేదు సార్, చిల్లరుండదు" "గూగుల్ పే అయితే అకౌంట్ లో పడిపోతుంది" "ఇంతకీ అకౌంట్ ఎవరిది" "ఇద్దరి పేరునున్నది సార్. జాయింట్ అకౌంట్ అన్నట్లు." సీతారాముడు ఆత్మ…
Read More

అర్చన

అర్చన రెక్కలు తెగిన ఆశ కూలిపోతుంటే మనసు చేష్టలుడిగి కూలబడింది వర్తమానం వేగుచుక్కని వేలమేసింది నిరాశ కలలన్నీ నిస్సహాయంగా చూసే కథలయ్యాయి కల్పతరువనుకున్న కాలం కాలు దువ్వుతోంది కాలు కదలదు..నోరు మెదపదు జీవితం మదుపులో ఉన్నట్టుంది రిక్త హస్తంలా మస్తిష్కం శూన్య దేవతగ మారింది చుట్టూ బంధనాల్లాంటి కందకాలు విరిసే బాట విధ్వంసమయింది వీరుల ప్రమాణాలన్నీ వీథిన పడ్డాయి వెడలిపోయిన వసంతంలా వడలిపోయిన ఆలోచనలు కల్లోల్లాన్ని కానుక చేస్తుంటే మనసు కుదుర్లను బిగించి శూన్యాన్ని ఆత్మవిశ్వాసంతో అర్చిస్తేకానీ అస్థిరతల పొగమంచును దాటేలాలేను - సి. యస్. రాంబాబు
Read More

మేలుకొలుపు

మేలుకొలుపు కాలాలు కదిలిపోతున్నా మాయాప్రపంచ మోహంలో మనిషి కదలికలేనట్టు కూరుకు పోయాడు స్వార్థం సాలెగూడు అల్లికలో సాటి మనిషి ఉనికి ఊపిరాడనివ్వటం లేదతనికి కలలు ఆశయాలు విలువలు ఇప్పుడతనికి ఎండిపోయిన బాల్యపు గుడి కోనేరు సంపద లెక్కల ఎక్కాల బట్టియే అతని గాయత్రీ మంత్రమిప్పుడు తంత్రం కుతంత్రం అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అర్ధరాత్రివేళ అతని వూరు మూగరోదన గుండెపై సమ్మెటపోటవుతుంది ఇప్పుడుతను బాల్యం బోనులో బందీ అతనింట అలంకారప్రాయుడైన తథాగతుడి చిరునవ్వు అతని దుఃఖాన్ని కడిగేస్తుండగా మాగన్నుగా కునుకుపడుతుంటే జీవితానికి అర్థం వెతుక్కుంటాడతను - సి. యస్. రాంబాబు
Read More

నడకగీతం

నడకగీతం పల్లవి అరుణోదయమును చూసేద్దాం అవధుల హద్దును చెరిపేద్దాం వేకువ పూలై వికసిద్దాం వెన్నెల రేయై పయనిద్దాం చరణం అడుగే వేయగ రావోయి దొరవై జగతిని ఏలేయి సుఖమింకెక్కడ లేదోయి అలసత్వాన్నే తీసేయి చరణం పదము పదముతో అర్చిద్దాం పలుకుతేనెలుగ మార్చేద్దాం వేకువ పండగ చేసేద్దాం వేదనలన్నీ తీసేద్దాం చరణం గాలీ, ధూళిని ప్రేమిద్దాం ఆలోచనలను కట్టేద్దాం ఆయాసాన్ని నెట్టేద్దాం అడుగు అడుగు జత చేద్దాం చరణం నడకే తోడని భావిద్దాం నడిచే దైవం నడకందాం నడకే నిత్యం శ్వాసిద్దాం వెలుగు రేఖగా భాసిద్దాం - సి. యస్. రాంబాబు
Read More

అనుభూతుల వల

అనుభూతుల వల దోచుకునే జనాలున్నట్టే దాచుకునే దోస్తులుంటారు శ్లేష్మమై జీవితం మింగేస్తుంటే జీవన సౌరభం జారిపోతుంటుంది బాల్యపు మిత్రుడెప్పుడో చరమాంకంలో చరిత్ర పాఠంలా పలకరిస్తాడు వళ్లంతా చెవులు చేసుకుని జ్ఞాపకాల స్వరమాధురికి తలొగ్గుతాం తారతమ్యాలు లేని ఆకాలంలో అందరూ తారలే మధ్యలో వచ్చే హోదాల గోదాల్లో సిగపట్లతో అలిసిపోయాక సిగ్గే మిగులుతుంది మునిమాపువేళంతే మధుర జ్ఞాపకాలను చప్పరిస్తుంటుంది గతం వర్తమానాల మధ్య లోలకమై లోపలి దాహానికి చలివేంద్రమవుతుంది ఇక భవిష్యత్తు బెంగనిపించదు నడిచిన బాటలో చేసిన గాయాల చింతే ఉంటుంది అనుభూతుల వలేసి మిత్రులను గాలించటమే మిగిలింది - సి. యస్. రాంబాబు
Read More

సాయిచరితము

సాయిచరితము పల్లవి దారే కనపడక బాధను దాచితిమి గురువే నీవనుచు ప్రార్థన చేసితిమి... సాయి.. మా సాయి చరణం కాలము వెలుగులో కరుణే చూపెదవు ధైర్యము నీవనుచు ముందుకు సాగెదము నీ మూర్తి దాచుకుని నీ స్ఫూర్తి తీసుకొని నిలబడినామయ్యా జీవితము నీదనుచు ఇంకేమి కోరమయా చరణం స్వార్థాన్ని విడలేని బతుకేమో మాదయ్యా దయచూపి మమ్ములను మార్చగా రావయ్యా నీ చరిత చదివినచో రాతేమో మారునయా అందరొకటేనన్న భావనే నేర్పవయా చరణం సాయి అని తలచినచో మనసేమో ఉప్పొంగు దరిచూపి దీవించి ప్రేమగా నవ్వుతావు కల్లోల జీవితాన్ని సరిజేయు వాడవుగా మావెంట నీవుంటే మదికేమో మురిపెముగా చరణం ఏ జీవికైనను ఆకలొకటేననుచు అది తీర్చు మనిషంటే నాకేమో ప్రేమనచు నీ తత్వమును తెలిపి ధన్యులను చేశావు మనిషిగ బతికేందుకు దారినే చూపావు - సి. యస్. రాంబాబు
Read More

ఓదార్పు

ఓదార్పు చేరుకోలేని గమ్యాలన్నీ రాత్రివేళ పరిహసిస్తుంటాయి చేవచచ్చిన జీవితం జ్ఞాపకాల మాటున దాక్కునే ప్రయత్నం చేస్తుంది రాత్రి మహా చెడ్డది పొడుస్తూనే మధనాన్ని మంటలా చేస్తుంది ఆలోచనల వెచ్చదనాన్ని కాచుకుంటూ కలల్లోకి జారుకుంటాను బాల్యమిత్రుడొకడు కనిపించి కలవరపెడుతుంటాడు కరగిపోయిన క్షణాలకు క్షమాపణ చెబుతుంటాను అపజయాలను విజయాలు చేసి ఆనందిస్తుంటాను పరిహాసాలను మందహాసాలు చేసుకుని అలా స్వప్నసంచారం చేస్తుండగానే విచలిత స్వరమై రణగొణ ధ్వనులు ఈ వింతలమారి ప్రపంచంలోకి నెట్టేస్తాయి తట్టా బుట్టా సర్దుకుని చెప్పా పెట్టకుండా చెక్కేసిన రాత్రిని శపిస్తూ వంటరి పోరాటానికి సిద్థమవుతుండగగా శీతగాలొకటి ఓదారుస్తుంది - సి. యస్ రాంబాబు
Read More

సంక్షిప్త సందేశం

సంక్షిప్త సందేశం ద్వేషించే హృదయాలు కూడా ఉదయాలను ప్రేమిస్తాయి పరిశుద్ధులను చేస్తాయేమోనని ఎదురుచూస్తుంటాయి మనుషులంతా ఒకలా ఉండనట్టు ఉదయాలన్నీ ఒకేలా ఉండవు లాలించేవి విసిగించేవి చురుక్కుమనిపించేవి,చెక్కిలి నిమిరేవి..ఎన్నని.. ఏ ఉదయం వెనక ఏ దుఃఖముందో ఎవరికి ఎరుక మనలా రాగద్వేషాల మూటలా మబ్బులని సందేహపడుతుంటాను అరుణకిరణాలతో అలంకరించుకొని జగతిని లేపే విధినిర్వహణలో ఉంటాయి కదా ఎండాకాలం చిటపటలాడి వానాకాలం లో చినుకు నిచ్చెనలేసి చలికాలపు బద్దకాన్ని కప్పుకుని ఋతువుల మేడలో దర్శనమిస్తుంటాయి ఋతువేదయినా ఆశల్ని పెంచుతూ ఆకలిని దాచుతూ బాధను మింగుతూ ద్వేషాన్ని తుంచుతూ సాగమని ద్వేషించే హృదయాలకు గాలితో సంక్షిప్త సందేశాలు పంపుతాయి - సి. యస్. రాంబాబు
Read More