c s rambabu

తీరం చేరని అల

తీరం చేరని అల ఆలోచనల్లా కదిలే మేఘాలు ఎక్కడో వర్షించి భారాన్ని దింపుకుంటాయి బాధ్యత లేని ఆలోచనల భారమే మనిషిని కలవరపెడుతుంటుంది వర్షించే మేఘం ఆహ్లాదమూ కావచ్చు ఆవేశమై రావొచ్చు వర్షించే కళ్ళకు బాధొక్కటే తెలుసు దిగులు కప్పుకున్న ఆకాశం వానతో తెరిపిన పడుతుంది దిగులు నిండిన మనసేమో మాటరాని మౌనమై మిగులుతుంది మేఘాల దిగులంతా తాత్కాలికం మళ్ళీ చెంగుమంటూ కదిలిపోతాయి దిగులు మనిషి మాత్రం తీరం చేరని అలలా మిగిలిపోతాడు - సి.యస్.రాంబాబు
Read More

ఎవరతను

ఎవరతను దేవాలయాలకై దేెశయాత్ర చేస్తాడతను దేహమే దేవాలయమంటే ఒప్పుకోడు! అద్వైతమే తన మతమంటాడు తనలోనే పరమాత్మ ఉన్నాడంటే ఛస్తే ఒప్పుకోనంటాడు! పాతొకరోతని చెబుతుంటాడు పాత వస్తువులనే ప్రేమిస్తాడు అది పురాణమైనా ,పికిల్ అయినా! ఆరోగ్యమే సంపదని ప్రవచిస్తాడు సంపదనే ప్రేమిస్తాడు ఆరోగ్యం పోయి సంపదే మిగిలింది! పదిమందికి వసుధైక కుటుంబం గురించి బోధిస్తాడు మనసంతా తను, తన కుటుంబమే! భిన్నత్వంలో ఏకత్వం మన బాటంటాడు ఆచరణలో భంగపరుస్తుంటాడు! ఎవరయ్యా అతను ? బెంగపడకండి అతను మన అంతర్గత మిత్రుడే అయుంటాడు తరచి చూస్తే! - సి.యస్.రాంబాబు
Read More

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి నిను తలచని నేను లేనే లేను నీ పిలుపుకు మేను పులకించేను చరణం నీ పలుకు మాకు అండ దండ నిను చూస్తే చాలు నీరసమే లేదు నీ స్మరణే చాలు భయమే లేదు కలియుగము లోనా కాపాడేవాడా చరణం తిరుమల గిరులు మాకేమో ఊపిరి ఆనందనిలయుడు ఆదుకునే దేవుడు నీ చల్లని నవ్వే మాకేమో కానుక నీ నీడన ఉంటే మాకేమి కాదుగా - సి.యస్.రాంబాబు
Read More

అక్షరపరిమళం

అక్షరపరిమళం విమర్శనాస్త్రాలు పదునెక్కుతుంటే అక్షరాలు అస్త్ర సన్యాసం చేస్తానంటున్నాయి భావాలు బతిమాలుతున్నాయి ఏమీ చేయలేక కవి చేరగిలబడ్డాడు నీ వంకర టింకర నడకను సరిచేసేందుకే విమర్శ జడివానై తడేపేది కొత్త దారి వేయాలంటే పదసంపద పెంచుకోమని సలహా చెబుతున్నాయి భావాలు గుమిగూడుతూ ఉప్పొంగే అలలాంటి భావాలను నియంత్రించే మనసుకు నను సరిచేసే బాధ్యత లేదా చిరుబురులాడింది అక్షరం హృదయానికి ఉద్వేగమెక్కువ ఊరికే తొందర పెడుతుంది మనసు రుసరుసలాడింది హృదయానిది నదీ పారవశ్యం తప్పు నాదంటూ తలదించుకుంది బుద్ధి అంతా శాంతించినవేళ మనసు కోయిల రాగమాలికయ్యింది మెరుగు పెట్టే బుద్ధి తోడుతో భావాలను అలంకరిస్తూ అక్షరమిప్పుడు ఆత్మవిశ్వాసపు కోట - సి. యస్. రాంబాబు
Read More

సాయిచరితము 

సాయిచరితము  పల్లవి బతుకే భారమయా ధైర్యము నీయవయా సాయము చేసేటి సాయి ఒకడేలే చరణం బాధలు భయపెడితే భయమే వెంటుంటే సాయినే తలచితివా అండ నీకు దొరుకునుగా అంధకారముంటేను ఆపద కలిగినచో నీడగ తానేమో ఉంటాడు చూడవయా చరణం తన భక్తుల కోసం పగలు రేయిని మరచి కాపాడుట కోసం వెంటే ఉండునుగా చింతే తీర్చునుగా మీరంత పిల్లలనుచు వెన్ను నిమురును తాను నీ బాధ నాదనచు ఆభయము ఇచ్చునుగా - సి. యస్. రాంబాబు
Read More

అమూర్త గానం

అమూర్త గానం రోజూ చూస్తుంటానా బల్లని అలసిన దేహాన్ని మాసిపోయిన జ్ఞాపకాల్నీ కడిగి ఆరేయమంటూ ఆహ్వానించిందా బల్ల పరికించి చూశాను ఎంతమందికి ఆశ్రయమిచ్చిందో ఎన్ని అనుభవాల నెమరువేతకు నీడనిచ్చి భుజం తట్టిందో మనతో మట్లాడుతున్నట్టే అనిపిస్తుంది నిశ్శబ్దంగా నిశ్చలంగా ధైర్యాన్ని కప్పుకునుంటుందేమో ఆ అమూర్త స్వరూపిణి నాలోని బేలతనం కొత్త ఊపిరిపోసుకుంటుంది! ఆ బల్లను చూస్తే నాకు తరలిపోయిన అమ్మ తిరిగొచ్చి భుజం నిమురుతున్న అనుభూతి! పరుగు పందెంలో ఓడిపోతున్న ప్రతిసారీ నన్ను పునస్సమీక్షించుకోమని చోటు చూపించే ఆ అమూర్త స్వరూపిణిికి రోజూ నమస్కరిస్తుంటాను! - సి. యస్. రాంబాబు
Read More

స్టేటస్ ప్రపంచం

స్టేటస్ ప్రపంచం ఆలోచనల అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నామా స్టేటస్ శిఖరాలు ఎక్కాలని ఎన్ని ఎత్తులు వేస్తుంటాం కునుకు రానివ్వకుండా కళ్ళనిండా వినిమయ ప్రపంచం తారట్లాడుతుంది కపటం రెక్కలపై ఎగిరే విహంగమై ఆడంబరాల ఆకాశాన్నందుకోవాలని తపిస్తాం రంగుల ప్రపంచం మాయతెర చాటున క్రూరత్వం ప్రదర్శనలో పోటీ పడతాం కూలి పోతున్న బంధాలు పెరిగిపోతూ వ్యాపార సంబంధాలు మనిషిప్పుడు కుళ్ళిపోతున్న విలువల కూడలి వానకి వణికిపోయే చిగురుటాకులా వడలిపోతున్న మానవత్వానిదో మౌనరోదన ఆలోచనల అద్దంలో ఎన్ని ముఖాలు ఎన్ని ముసుగులు గుసగుసలాడుతుంటాయి అందుకే ఆలోచనల అద్దంలో చూసుకోవాలనుకోకు మనసు ప్రవచించే మాటలు బీడుభూములయిన వ్యక్తిత్వాలపై తొలకరి చినుకులు కావు నవ్వు మాస్క్ వేసుకున్నా నీ ఆనందాన్నెప్పుడో తస్కరించింది స్టేటస్ ప్రపంచం - సి. యస్. రాంబాబు
Read More

వాన దృశ్యం

వాన దృశ్యం మేఘాల సామూహిక గానం నగరాన్ని హర్షంతో తడిపేసింది ముడుచుకున్న నగరం బద్దకాన్ని కప్పుకుంది మినుకుమనే వాహనాలన్నీ తొందరపడటం లేదు చినుకులను చప్పరిస్తూ రీఛార్జ్ అవుతున్నాయి అడపాదడపా రాలే చినుకులు చిత్తడినేలతో చిలిపి ముచ్చట్లను చెబుతున్నాయి మూలనున్న మందార చెట్టు ఆకుపై చినుకు ముత్యం మెరుస్తోంది దాచుకున్న జ్ఞాపకాల్లా నేలపై నీటి అద్దాలు తళతళమంటున్నాయి! పాలపేకెట్ కుర్రాడు యాంత్రికంగా కదిలాడు కునుకు వదలిన బైరాగి బీడీ ముట్టించాడు తోకాడిస్తూ కుక్కపిల్ల ఏదో చెబుతోంది ముట్టడించిన వాన మందగించేదెప్పుడనా! చుట్టపు చూపులాంటి వర్షపుగాలి వచ్చిందంటే చాలు వేడి కాఫీతో మనసుని వెలిగించి గతం రోడ్డుని సాఫు చేస్తుంది వర్షపు చినుకు ఊరికే ఉండనివ్వదు అనుభూతులను ,అనుభవాలను కలిపేసి మనుషులతోపాటు పాటు నగరాన్ని కూడా ఏకాంత మందిరం చేస్తుంది! - సి. యస్. రాంబాబు
Read More

వెతుకులాట

వెతుకులాట అసంతృప్త ద్రావణంలా మనసు మరుగుతోంది ఖైదు చేసినట్టు ఆలోచనలు మేకులు కొట్టేసినట్టు మౌనం వహించిన మాటతో నిరాశల నిషాలో నేనిప్పుడు కనుచూపులో ఆశేలేక కంటి చూపు మందగించింది అడుగేసే పాదం అడుసులో చిక్కినట్లు చుట్టూ దిగ్బంధం విడిపించి నడిపించే అక్షరం ఎటుపోయిందా అని వెతుకుతున్నాను - సి. యస్. రాంబాబు
Read More

మాటిచ్చాను

మాటిచ్చాను మబ్బులన్నీ భేటీ అయాయి మనుషుల మనసుల మల్లే! మల్లెలను చినుకుల్లా రాల్చాయి కునుకు పానుపును సాఫు చేశామని భ్రమ పడుతున్నాయి! పహరా కాస్తూ రాత్రి మనసు తలుపులను తెరిచింది ! జ్ఞాపకాలను దులిపి చిలిపిగా నవ్వినా గతం గాయమై సలుపుతోంది! కలహం, ప్రణయాల చిరునామాల కాలం కిసుక్కుమంటోంది! జారిపోయే క్షణాలను దాచుకోక గతం రహదారులకు బాధను పూస్తావే అని చికాకు పడుతోంది ! ఉలిక్కిపడి బుద్ధినో కొలిక్కి తెచ్చాను! వర్తమానం రుచికి గతం తీపిని జతచేయాలనుకుని చినుకు మల్లెలను దోసిట పోశాను ! మబ్బుల భేటీకి మనోయానం చేసి మన్నించమన్నాను! కునుకు పానుపు పై భవిష్యత్తు కలలు పరచి గతం గులాబీలతో అలంకరిస్తానని మాటిచ్చాను! - సి. యస్. రాంబాబు
Read More