c s rambabu

ప్రగతికి జ్యోతులు – బాలల గీతం

ప్రగతికి జ్యోతులు - బాలల గీతం పల్లవి నేలను నింగిని కలిపేస్తాం ఆనందాలను దించేస్తాం అలసటలన్నీ తీసేస్తాం మేమే బాలలం..ప్రగతికి జ్యోతులం చరణం పాఠశాలయే మా ఇల్లు గురువులు మాకు దేవుళ్లు చదువే మాకు కళ్ళండీ ఇది నిజమండీ నమ్మండీ మేమే బాలలం!ప్రగతికి జ్యోతులం! చరణం అమ్మా నాన్నల నమ్మకము మము దీవించే ఆకశము ఆశల దీపము వెలిగించి ఆశయ సాధన చేసెదెము!! మేమే బాలలం!ప్రగతికి జ్యోతులం! చరణం ఆటపాటల అల్లికతో అలుపు సొలుపు ఉండవుగా కలల కోటలే కట్టెదము కలతలు నలతలు తీర్చెదము!! మేమే బాలలం!ప్రగతికి జ్యోతులం! చరణం నిన్నటి చరితను చదివేసి రేపటి భవితను రాసేసి నేటిమాటను నేర్చుకునే ఆశయ సౌధాలం మేమే బాలలం!ప్రగతికి జ్యోతులం! - సి. యస్ రాంబాబు
Read More

వేకువై విచ్చుకో

వేకువై విచ్చుకో నిశ్శబ్దాల నిశీధిలో స్వప్నమై అడుగేయ్ స్వేచ్ఛా దీపాలను వెలిగించి వెలివేసిన ఆలోచనలను వేకువగీతం చేయ్ వేధించే శత్రువుల్లా కోపతాపాలు కోరికలు దాడి చేస్తుంటే సందిగ్ధాల నదిలో నిర్భయవీరుడిలా తెడ్డేయ్ మాటను గురిపెట్టే విలుకాండ్రను మౌనంతో కాచుకుంటూ చిరునవ్వు అస్త్రాన్ని వాడాలి వడలిపోయి వెడలటం కాదు వెతలే ఊతంగా గమ్యంవైపు సాగు అసత్యం నీడలా వెంటాడుతుంటే నీడనిచ్చే నిజాల చెట్టెక్కడో ఉండే ఉంటుంది సత్యాల తోటలో అడుగుపెట్టావా సందేహాల మదిలో అరుణకాంతులు తొలి వేకువై విచ్చుకుంటాయి - సి. యస్. రాంబాబు
Read More

బహురూపి

బహురూపి చిత్రమీ జీవితం సామాన్యుడికేమో నాలుగు ముద్దలు దొరకాలంటే శ్రమే సౌఖ్యమంటుంది కొండలు కరిగించేవారి అడుగులకు మడుగులొత్తుతు మహా సిగ్గు పడుతుంటుంది ధన్యక్షణాలను లెక్కిస్తుంటుంది పురివిప్పిన నెమలిలా శ్రమ సౌందర్యమో సామూహిక జీవనగానం అభిమానాల కొలమానమని కవి తృప్తి పడుతుంటాడు కంటి చూపుతో శాసించే కాసుల వర్గం ఆనంద క్షణాలను గాలిస్తుంటుంది ఆధ్యాత్మికత ఆసరాతో ఇహపరాలను జయిద్దామనుకుంటుంది అసమానతలు కొత్తవికావు ఆకలి బాధలు తీరేవికావు భిన్నరూపాల ప్రపంచం అర్థం కాని సమాంతరదారులతో జీవితమో బహురూపి - సి. యస్. రాంబాబు
Read More

చేవ్రాలు

చేవ్రాలు ఎడారిలో కోయిలలా కాంక్రీటు రోడ్డు పై ఆత్మీయతను నాటినట్లున్న ఆ మొక్క నా కుశలమడుగుతుంది జాలి దయలేని కాలం కాటేసిందనో అవమానాల విపణిలో నను వేలం వేసిందనో కప్పిపుచ్చుకుంటుండగా పచ్చని చూపును నాపై ప్రసరిస్తుంది తన తనువంతా గాయాలే లేపనం పూసేవారే లేరని తెలిసినా గుర్తించని నేను నా మేనంతా మోసాల పుండేనంటాను సంతోషాల 'మేనా'లో కూచోపెడతావాని వెటకరిస్తాను పూల శరీరం పచ్చని నవ్వై ప్రకాశిస్తుండగా బుద్ధభగవానుడిలా చూస్తుంది అప్పుడు వెలిగిన నా బుద్ధి కొంచెం సిగ్గుపడుతుంటుంది దారంతా రాళ్ళున్నా దీవించే మెత్తని ఇసుకా ఉన్నట్టే మట్టిలో కలిసేముందు కాస్త మానవీయ స్పర్శను వళ్ళంతా హత్తుకోవాలి బట్వాడా అవుతున్న భావాలు ఆ మొక్క చేవ్రాలని తెలుస్తుంటే నా కళ్ళువాలిపోతున్నాయి మనసు సోలిపోతోంది - సి. యస్. రాంబాబు
Read More

మిన్న

మిన్న మోయలేని భుజకీర్తుల కన్నా మూగిన భజన బృందాల కన్నా పేరుకోసం పాకులాట కన్నా పుడమి రోదన ఆపటం మిన్న ముక్కుమూసే ధ్యానం కన్నా కనులమూతల నటన కన్నా తేనెపూసిన కపటం కన్నా ముక్కుసూటి మాటే మిన్న కలల ప్రపంచంలో తేలేకన్నా కలలు కనమనే ప్రబోధం కన్నా కష్టాలను ప్రేమించండనే బోధన కన్నా నేల నిలిచే చూపు మిన్న సాయమడిగే పెదవుల కన్నా నిందలేసే నైజం కన్నా నీడ వెతికే సుఖం కన్నా నువ్వేమిటో తెలియటం మిన్న - సి. యస్. రాంబాబు
Read More

హృదయాకాశపు వెలుగు

హృదయాకాశపు వెలుగు అతనో అగ్ని గోళం అతనిదో సందడి వేషం అతనో నిరంతర యాత్రికుడు నిలకడలేేని మానవ జీవన నావికుడు కాలానికి మిత్రుడీ రోదసీ చక్రవర్తి ఈనిత్య సంచారి నీడలో రోదించే చరితను ఓపికపట్టమంటాడు విజయాలు ఓటమిల బాటలో అలసిన జీవితాలకు ఓపిక నేర్పుతుంటాడు దేవుడున్నాడో లేదో అతను మాత్రం కనిపించే దైవం కని పెంచిన అమ్మంత సత్యం నిత్యగీతమై మనలో పలుకుతుంటాడు ఉదయాన్నే వెలుగై సాయంత్రానికి సంబరమవుతాడు కనిపించని సాయమై కలలను పంచే న్యాయమై వెంటే ఉంటాడు అగాధాల రాత్రులలో జీవితం జారిపోతుంటే ఉదయమై చేయందిస్తాడు మధ్యాహ్న మార్తాండుడై మాడ్చేసినా కలతలను ఊడ్చేసే హృదయాకాశపు వెలుగతను - సి.యస్.రాంబాబు
Read More

అప్పగింతలు

అప్పగింతలు కాలచక్రం బాటలో అలిసిపోయిన కాలిచక్రాలు ఆగమంటుంటాయి వెనక్కి తిరిగి చూస్తానా తిరిగి రాని లోకాలకు తరలివెళ్ళినవారంతా తారలై మెరుస్తుంటారు మసకబారిన కన్నులపై జ్ఞాపకాల పుప్పొడి కరిగిపోయే మంచుశిఖరంలా జీవితం తుది అంచుకు చేరుతుంది కోపాలు శాపాలు లోపాలు మురిపాలు కలిసికట్టుగా నవ్వుతుంటాయి ఏం సాధించావని తలెగరేస్తావని తోడులా నిలిచిన కుటుంబాన్ని మీగడలా మెసలిన మిత్రులను నా కలలమేడకు మెట్లులా కట్టిన అమ్మానాన్నలని తలుచుకోనందుకో వారిలా నన్ను మలచుకోనందుకో మాటరాక మౌనంతో సహజీవనం చేస్తున్నాను చరమాంకంలో చెదలు పట్టక పట్టుతప్పిన జీవితాన్ని అదుపులోకి తెస్తుంటే మాఘమాసపు మంచులా కాలం కాసేపు ఘనీభవించింది అప్పగింతలు చెప్పుకోమని - సి. యస్. రాంబాబు
Read More

సాయిచరితం

సాయిచరితం పల్లవి: మా తనువు మనసును కాపాడవయ్యా మార్గమే చూపి ఆదుకోవయ్యా సాయే శరణం..సాయే దైవం చరణం: నీ చరితే నింపును మాలోన ధైర్యము నీవే మావెంటుండే పోరాడే సైన్యం షిరిడీయే మనకు ఇలవెలిసిన స్వర్గం నిన్నేమో చూడాలని మనసుదో స్వప్నం చరణం: అందరీ దైవమూ ఒకటే అంటావు భేదభావనలు వలదే వలదంటావు ఓపికే లేని బతుకులు మావయ్యా బతిమాలుకుంటాము నీ బాటను చూపమని చరణం: బంధమై మావెంట ఉంటేను నీవు ఊరడిల్లుతాము.. సేదదీరుతాము వర్తమాన వెలుగువై మా గుండె నుండు సందేహ బతుకుల్లో సందడే విరియును చరణం: ఊపిరై నీవుంటే ఊయలే ఊగేము వెన్నెలై నీవుంటే వెతలన్నీ దూరమిక వన్నెచిన్నెల రేడు మా సాయినాధుడు మా కోసం వెలసిన సద్గురుమహరాజువే - సి. యస్. రాంబాబు
Read More

షుక్రియా సాబ్ – కథానిక

షుక్రియా సాబ్ - కథానిక ఆఫీసు పనిమీద అర్జంట్ గా కోఠి వెళ్ళాల్సి వచ్చి క్యాబ్ దొరక్క రోడ్డుమీద కొచ్చాను. కనీసం ఆటో అన్నా దొరుకుతుందేమోనని. ఆటోలు చాలా ఉన్నాయి కానీ ఒక ఆటో నన్ను ఆకర్షించింది. కాదు.. కాదు.. నన్నాకర్షించింది ఆ ఆటో డ్రైవర్. యాభై పైనే ఉంటాయనిపించింది. చాలా శుభ్రంగా ఉండి తలపై చిన్న టోపీ, గడ్డం.. చూస్తే ముస్లిం లా ఉన్నాడు. చేతిలో హిందూ పేపర్ ఉంది. "ఎక్కడికి పోవాలి సర్" చాలా మర్యాదగా అడిగాడు. "కోఠి వస్తారా" అంతే మర్యాదగా అడిగాను. అక్కడితో ఆగకుండా ఎంతిమ్మంటారని కూడా అడిగాను.. "భలేవారే సర్. మీటర్ హైనా" అంటూ మీటర్ వేసి నన్నాశ్చర్యపరిచాడు. "ఈరోజుల్లో మీటర్ వేసేవాళ్ళున్నారా" అన్న నా మాటకు అతని సమాధానం ఇంకా ఆశ్చర్యపడేలా చేసింది. "మీటర్ ఉన్నప్పుడు వేయాలి సర్. వద్దనుకుంటే ఆ మీటర్ పనిచేయటం లేదని మాత్రం అబద్దమాడకూడదు సర్" అతని సమాధానం…
Read More

ప్రబోధం

ప్రబోధం ఆకలి త్రాసులో జీవితాన్ని తూస్తుంటావు అది అహర్నిశలు జాగురూకతను నేర్పుతుంది ఈలోగా ఆకలిని సముదాయించటం అలవాటవుతుంది ఇక్కడ నీతీనియమాలు మంచితనపు నీడల జాడలు ఉండవు విలువల చలువ పందిరి అసలే ఉండదు కాలమే తోడు..ఆత్మవిశ్వాసమే చలువరాతి మేడ అందుకే మోసాల పాముపడగల నీడలో తలదాచుకుంటుంటే నిచ్చెనెక్కే కిటుకు తెలియొచ్చు వైకుంఠపాళి జీవితం వైకుంఠాన్ని చూపదు కానీ వెన్నెలరాత్రులను వెతికే తోడవుతుందేమో విశ్వాసాన్ని వీడక ధైర్యం కరవాలంతో లక్యంవైపు దూసుకుపోవటమే కర్తవ్యం అని ఎవరూ చెప్పరు నీకు నువ్వే చెప్పుకోవలసిన ప్రబోధం - సి. యస్. రాంబాబు
Read More