పొడిచే పొద్దులతో నడిచిపో...!!!

పొడిచే పొద్దులతో నడిచిపో…!!!

పొడిచే పొద్దులతో నడిచిపో…!!!

పెరిగే ప్రపంచం విప్పారిన
కళ్ళకు అర్థం కాలేదేమో…!!
నింపుకొన్న ఆశల తొడుగులతో
నిలుపుకోలేని బతుకు నిశ్చలతను
కోల్పతు…వ్యామోహాల పురిటిలో
కోరికలను బదలాయించిన మానసిక
మర్మాలకు దాసోహమై బతుకుచున్నావు

ఏదో ఒకలాగ బతకొచ్చనే…
ఖచ్చితంలేని నిర్ణయానికి పూరకమై
అగుపించని గమ్యాలతో నలిగిపోతు
నిబద్ధతలను కార్యరూపం దాల్చుకోలేక…
నిత్య వెలుతురుకు మబ్బువై నిశీలో
సిద్ధాంతాల నిర్వచనాలను
రాయాలని అక్షరాలను వెతుకుతున్నావు
విజయానికో పరాజయానికో…

సుఖదుఃఖాలు జీవితాన తెలిసిన
పాఠాలే నేర్చుకొనేవి కాదు…!!
రాగద్వేషాలతో లాలించబడుతు…
వీడని బంధాలతో నిరంతరాన్ని సృజన
చేసుకొంటు…అనునిత్యపు ఆలాపనలతో
శ్రామిక చైతన్యాన్ని మరిచిపోయి…
కారాగార బతుకులతో రోజులను
ఖైదు చేస్తున్నావు…

కొలతబడని కాలం వెలితి కాదు…
నీలోని ప్రయత్నానికి అడ్డంకాకు
బడవాగ్ని బతుకులని అంతుచిక్కని
అయోమయపు స్థితికి స్థానమవకు
కలలు తెలిసిన మనిషివై…!!
ఎద తలుపులకు ఎడతెగని బంధాలను
బిగించకు…ఆగని సమయపాలనకు
ఆస్వాధింపై ప్రకృతి చేతనలను ఆరాధిస్తు
పొడిచే పొద్దులతో నడిచిపో…

దేరంగుల భైరవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *